అడవి పంది దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 03 :
భీమారం మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామపంచాయతీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోదరి పురుషోత్తం కుమార్తె స్ఫూర్తి రాణి (4) సోమవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో తన ఇంటి ముందరి వాకిట్లో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన అడవి పంది చిన్నారిపై దారుణంగా దాడి చేసింది. అడవి పంది బలంగా గుద్దడంతో పాప సుమారు 10 అడుగుల దూరంలో ఎగిరిపడి, అక్కడ ఉన్న సిమెంట్ ఇటుకలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు మరియు శరీరమంతా తీవ్ర గాయాలై, రక్తం మడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే 108 వాహనంలో పాపను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పాప పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రతిమ హాస్పిటల్‌కు అత్యవసరంగా తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బాధిత కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. సకాలంలో ఆసుపత్రి ఖర్చులు భరించే స్థితిలో లేకపోవడంతో, అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు వెంటనే స్పందించి, ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.